శ్రీ కాంచీ పుర నిలయ కామాక్షీ అమ్మవారి దండకం
కీ. శే. బ్రహ్మశ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారి రచన
తెలుగు అర్థం - Dr. పాతూరి నాగరాజు
For English (Click here)
సకల జనని! తే నమః. కాంచి సంవాసి! భూతేశ భావానుకూలే! భవార్ణో నిధేర్ భీతభీతాన్ సముత్తారయన్తీ! సదైకామ్ర సాలస్య మూలే వసన్తీ! తపస్యన్తి! చిత్తోద్భవారాతి చిత్తస్య శాంతేః ప్రదాత్రీ! సుగాత్రీ! వినేత్రీ! సురారాతి వర్గస్య దాత్రీ !ముముక్షోర్ జనస్యాపవర్గస్య సర్గస్య భావస్య సంహార కార్యస్య కర్త్రీ !విధాత్రాది గీర్వాణ వర్గస్య రక్షా భవిత్రీ! స్వపాదాంబుజారాధనాసక్త చిత్తస్య దౌర్గత్య హన్త్రీ! భవత్యేవ దేవీతి నైరంతరేణాంతరే భావయంతం నమస్యంత మంతే వసన్తం మహాదేవి! కామాక్షి! సత్కర్మణాం సాక్షిణీ త్వం సదా వర్తసే. భర్తృ సేవా రతానాం సతీనాం భవత్యేవ ప్రాథమ్యమాపద్యసే. యస్స్మరేత్త్వాం సదారుణ్య భాసా విభాంతీం ద్రుతం హృద్య భావాంచితా భారతీ తస్య చాస్యా ద్వినిర్యాతి చిత్రం కిమత్రేతి సంభావయంతం ముదా మాం విలోక్యావితుం సేవితుం త్వాం మహాభాగ్య మాధాతు మభ్యర్థయే. వారణాస్యస్య స్కందస్య చాంబే !అఖిలాంబే! మదంబే !నమస్తే. నమస్తే. నమః.
అందరి/అన్నిటి కన్నతల్లీ! నీకు నమస్కారం. కాంచీపురంలో ఉండే దానా! భూతనాయకుడయిన శివుడి ఆలోచనలకు/ మనసుకు అనుగుణంగా నడచుకునే దానా! సంసార సముద్రంలో తీవ్రంగా భయపడి ఉన్నవారిని (ఆ సముద్రం నుంచీ/ ఆ స్థితి నుంచీ ) చక్కగా అవతలికి దాటించే దానా! ఎల్లప్పుడూ (కాంచీపురంలోని) ఏకామ్రవృక్షమనే మామిడి చెట్టు వేళ్ల దగ్గర నివసించేదానా! (అలా నివసిస్తూ అక్కడ ) తపస్సుచేస్తూ ఉండేదానా! మన్మథుడి శత్రువుకు (అంటే కామదహనం చేసిన శివుడికి) ( ఆ కామదహన సమయపు కోపాన్ని శమింపజేసి )మనశ్శాంతిని ఇవ్వగలిగేదానా! చక్కని శరీరాకృతి కలదానా! వినయము కలదానా! దేవతల శత్రువులను (రాక్షసులను) గడ్డి కోసినట్లు సంహరించేదానా!మోక్షమును కోరి దానికై కృషి చేసే వారికి మరణము, దానివలన పునర్జన్మలనే మాటే లేకుండగ ఆ చక్రమును సంహరించే దానా! బ్రహ్మాది దేవతలందరికి రక్ష అయిన దానా! నీ పాదపద్మాలను ఆరాధించే ఆసక్తి గలవారికి ఉన్న దుర్గతిని/కష్టాలను పోగొట్టే దానా! ఓ పెద్ద దేవీ! కామాక్షీ దేవీ! మంచి కర్మలన్నింటికీ నీవు ఎల్లప్పుడూ సాక్షిగా నిలుస్తూ ఉంటావనీ భర్త సేవలో ఇష్టంతో మునిగి ఉండే పతివ్రతలలో నీదే మొదటి స్థానమని దేవివంటే నీవేనని నిరంతరంగా మనసులో భావిస్తూ నీకు నమస్కరిస్తూ నీ పాదాల దగ్గర నివసిస్తూ ఎల్లప్పుడూ ఎర్రని కాంతితో ప్రకాశించే నిన్ను ఎవరైతే స్మరిస్తారో అటువంటివారి నోటి నుండి రమణీయ భావాలతో అందగించే కవిత్వం వడిగా వెలువడుతుంది ఇందులో వింత ఏముంది అని భావిస్తూ ఉండే నన్ను సంతోషంతో చూసుకొమ్మని (కాపాడమని) నిన్ను సేవించే మహాభాగ్యం ప్రసాదించమని వేడుకొంటున్నాను. గజముఖుడయిన గణపతికీ, సుబ్రహ్మణ్యస్వామికీ (ఆ మాటకువస్తే) అందరికీ తల్లీ! నా తల్లీ! నీకు నమస్కారం. నీకు నమస్కారం (అమ్మా) నమస్కారం.
No comments:
Post a Comment